Monday, December 20, 2010

ఫోలేట్‌' లోపంతో వినికిడి తగ్గుతోంది!

'ఫోలేట్‌' లోపంతో వినికిడి తగ్గుతోంది!
ఒక వయసు వచ్చేసరికి వినికిడి శక్తి కొంత తగ్గటం సహజమే. చెవులలోని అత్యంత సున్నితమైన వినికిడి యంత్రాంగంలో క్షీణతతో పాటు... దీనికి మరికొన్ని అంశాలూ తోడవుతాయని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
భారీ శబ్దాల బారినపడటం, పోషకాహార లోపం, ముక్కు-చెవులలో ఇన్‌ఫెక్షన్ల వంటి వివిధ అంశాలు వినికిడి శక్తిని దెబ్బతీసే అవకాశం ఉంది. అయితే వృద్ధాప్యంలో వినికిడి మందగించి, చెవుడు ముంచుకురావటానికి ఫోలేట్‌ (ఫోలిక్‌ యాసిడ్‌), బి12 విటమిన్ల లోపం కూడా కారణమవుతున్నట్టు తాజా అధ్యయనంలో గుర్తించారు.ఒకే వయసు వృద్ధుల్లో మామూలుగా శబ్దాలు వినగలిగే వారితో పోలిస్తే వినికిడి లోపం ఉన్నవారి రక్తంలో 'ఫోలిక్‌ యాసిడ్‌' స్థాయులు తక్కువగా ఉంటున్నట్టు నైజీరియాలోని ఇబదాన్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు. ఇక ఫోలిక్‌ యాసిడ్‌ 35 శాతం తక్కువగా ఉంటే పెద్ద పెద్ద శబ్దాలు కూడా వినబడనంతగా చెవుడు ఉంటున్నట్టు గుర్తించారు. ఫోలేట్‌తో పాటు కొద్ది మోతాదులోనైనా 'విటమిన్‌ బి12' లోపం కూడా దీనికి కారణమవుతోంది. ఈ లోపాలను చాలా తేలికగా మందులతో, మాత్రలతో సరిచేయొచ్చని పరిశోధకులు గుర్తించటం విశేషం. ఫోలేట్‌, బి12 విటమిన్లను ఇచ్చినప్పుడు వినికిడి మెరుగుపడటమే కాకుండా... జ్ఞాపకశక్తి పెరగటం, కాళ్లూ చేతుల్లోని నాడుల పని తీరుతో పాటు కేంద్ర నాడీ మండల వ్యవస్థ కూడా శక్తిని పుంజుకుంటున్నట్టు గుర్తించారు.
ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ అధ్యయనానికి చాలా ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా వయసు మీదపడుతున్న కొద్దీ సంప్రాప్తించే చెవుడు సమస్యను సరిచేయటం సాధ్యం కాదనే చిరకాల నమ్మకాన్ని ఇది మార్చేస్తుందని.. ఆ లోపాన్ని అధిగమించేందుకు కొందరికైనా ఇది మార్గం చూపుతుందని భావిస్తున్నారు.

1 comment:

  1. your blog is so effortless to read, i like this article, so maintain posting far more

    comment

    ReplyDelete