Monday, December 13, 2010

క్యాన్సర్‌ గుట్టువిప్పే వేలిముద్ర

క్యాన్సర్‌ గుట్టువిప్పే వేలిముద్ర
క్యాన్సర్‌ ఉందా? ఉంటే ముదురుతోందా? లేక అలాగే ఉందా? ఇలా దాని ఆనవాళ్లను ఎప్పటికప్పుడు తెలియజెప్పే తేలికపాటి పరీక్ష ఏదైనా ఉంటేఎంత బాగుండును?
ది ఎప్పటి నుంచో పరిశోధకుల మెదళ్లకు పదును పెడుతున్న సమస్య. ఎందుకంటే క్యాన్సర్‌ ఏ దశలో ఉందన్నది దాని చికిత్సకు కూడా కీలకమైన అంశం. ఈ ప్రశ్నకు సమాధానంగా శాస్త్రవేత్తలు తాజాగా ఓ రక్తపరీక్షా విధానాన్ని ఆవిష్కరించారు. ఇది ఏ రకం క్యాన్సర్‌ నైనా పట్టివ్వటమే కాదు, దాని స్థాయిని అంచనా వేసేందుకు ఉపయోగపడుతుంది. ఒకవేళ చికిత్స తీసుకున్న ఆ క్యాన్సర్‌ తిరగబెడుతున్నా కూడా పసిగట్టటానికి తోడ్పడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.
క్యాన్సర్‌ బారినపడిన వారిలో ఆ క్యాన్సర్‌ కణుతుల కణజాలంలోని జన్యువులను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత బాల్టిమోర్‌లోని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం ఈ పరీక్షా విధానాన్ని ఆవిష్కరించారు. చాలా వరకు క్యాన్సర్‌ కణుతుల్లో పెద్ద మొత్తంలో జన్యు పదార్థం మార్పు చెంది ఉంటుంది. ఇది ఆరోగ్యవంతమైన కణాలలో కనిపించదు. ఈ మార్పులే శాస్త్రవేత్తలకు కాన్సర్‌ కణాల ఆనవాళ్లను పట్టిచ్చే జన్యుపరమైన వేలిముద్రల్లా (ఫింగర్‌ ప్రింట్‌) ఉపయోగపడుతున్నాయి. ఆయా క్యాన్సర్లు రాల్చే కణాలు, డీఎన్‌ఏ కలవటం వల్ల క్యాన్సర్‌ బాధితుల రక్తంలో ఈ 'ఫింగర్‌ ప్రింట్‌' జన్యు సమాచారం చాలా ఎక్కువగా కనబడుతుంది. క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటున్న వారిలో దీని మోతాదు పడిపోతుంది. ఇక కణితి పూర్తిగా తగ్గిపోతే ఇది కూడా మాయమవుతుంది. పేగుల్లో క్యాన్సర్‌తో బాధపడుతున్న ఒకరికి శాస్త్రవేత్తలు జన్యు పరీక్షలు చేస్తున్నప్పుడు కణుతుల్లోని ఒక క్రోమోజోమ్‌ మరో క్రోమోజోమ్‌తో అతుక్కుపోయి కనిపించింది. కణుతుల జన్యు ఫింగర్‌ ప్రింట్‌లో ఇదే కీలకమైన మార్పు. అతడికి శస్త్రచికిత్స చేశాక ఈ ఫింగర్‌ప్రింట్‌ స్థాయి తగ్గిపోయింది. అయితే.. అతడి శరీరంలో క్యాన్సర్‌ ఇంకా మిగిలి ఉండటం వల్ల ఈ ఫింగర్‌ప్రింట్‌ స్థాయి కొన్నాళ్లకు తిరిగి పెరిగింది. అంటే క్యాన్సర్‌ మళ్లీ మొదలైన సంగతినీ రక్త పరీక్ష ద్వారా గుర్తించగలిగారన్న మాట. దీంతో పరిశోధకులు.. ఈ పరీక్షను మరింతగా అభివృద్ధిపరిచే పనిలో ఉన్నారు. చికిత్సకు క్యాన్సర్‌ కణుతులు ఎలా స్పందిస్తున్నాయో తెలుసుకోవటానికి, అవసరమైతే చికిత్సలో మార్పులు చేయటానికి కూడా మున్ముందు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

1 comment:

  1. I like it. I will be waiting for any future updates to this article.

    news

    ReplyDelete